ఆర్ధిక మోసాలకు పాల్పడిన అక్షర చిట్ ఫండ్ చైర్మన్ పేరాల శ్రీనివాసరావు అరెస్టు

  • ఆరు నెలలుగా పరారీలో ఉన్న అక్షర చిట్స్ ఛైర్మన్ అరెస్ట్
  • ఆదిలాబాద్‌లో పట్టుకున్న స్పెషల్ పోలీస్ టీమ్
  • శ్రీనివాసరావుపై రాష్ట్రవ్యాప్తంగా 96 చీటింగ్ కేసుల నమోదు
  • ఆదిలాబాద్‌లోనే రూ.1.11 కోట్ల మోసం ఆరోపణ
డిపాజిటర్లను మోసం చేసి, గత ఆరు నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న అక్షర చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పేరాల శ్రీనివాసరావును ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిన్న స్థానిక కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది.

ఈ అరెస్టు వివరాలను నిన్న ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. చిట్టీల పేరిట డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడిన అక్షర చిట్‌ఫండ్‌ ఛైర్మన్ పేరాల శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఆయన తెలిపారు. ఒక్క ఆదిలాబాద్ టూ-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 12 కేసుల్లో సుమారు రూ.1.11 కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా శ్రీనివాసరావుపై మొత్తం 96 చీటింగ్ కేసులు నమోదయ్యాయని ఎస్పీ పేర్కొన్నారు. ఆరు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న నేపథ్యంలో పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఆదిలాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశామని  ఆయన చెప్పారు. నిందితుడి నుంచి ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

హనుమకొండ జిల్లా వాసి అయిన శ్రీనివాసరావు, 2009లో చిట్ ఫండ్ వ్యాపారం ప్రారంభించి తెలంగాణ వ్యాప్తంగా 54 బ్రాంచులు ఏర్పాటు చేశాడు. కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్‌లోని అతని ఆస్తులను చట్టప్రకారం జప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. గత ఫిబ్రవరిలో శ్రీనివాసరావు భార్య, కంపెనీ డైరెక్టర్ అయిన శ్రీవిద్య అమెరికాకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడిన సంగతి తెలిసిందే.
 

Perala Srinivasa Rao
Akshara Chit Fund
chit fund scam
Adilabad police
financial fraud
Sri Vidya
Hanumakonda
Telangana
crime news

More Telugu News